Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page

సాక్షాత్తు శివావతారము
శంకరభగవత్పాదులు

సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిరస్థానాంతరాధిష్ఠితం

సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్వాసనా శోభితమ్‌,

భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం

సేవే శ్రీగిరి మల్లిశార్జున మహాలింగం శివాలింగితమ్‌||

- శివానందలహరి.

ఆంధ్రదేశంలో ఉన్న శ్రీశైలం ప్రసిద్ధిగాంచిన శివక్షేత్రం అందలిస్వామి మల్లికార్జునుడు. మద్దిచెట్టును మల్లెతీగ అల్లుకొన్న విధంగా మల్లికార్జునస్వామి ఉన్నాడట. ఈశ్వరుడు స్థాణువు స్థాణువైన ఈశ్వరుణ్ణి సూచిస్తున్నది అర్జునవృక్షం లేదా మద్దిచెట్టు. భ్రమరాంబికయే మల్లెతీవ. శివశక్తుల సంయోగమంటే, మన మేధ ఈశ్వరుని శుద్ధతత్త్వంలో ఐక్యం కావటమే.

''శ్రీశైలంలో మల్లికార్జునస్వామి వెలసి ఉన్నాడు. సంధ్యారంభంలో విజృంభించి తాండవం చేస్తున్నాడు. శ్రుతి శిరస్థానములని పేరుపడ్డ ఉపనిషత్తులలో వాసం చేస్తున్నాడు. భ్రమరాంబికా యుక్తుడై, ఆనందమూర్తియై, ముముక్షు హృదయవాటికలలో పరవశుడై తాండవం చేస్తున్నాడు. అట్టి శివాలింగినమైనమల్లికార్జునమహాలింగమూర్తినిసేవిస్తున్నాను''. అని భగవత్పాదులవారు అంటున్నారు.

ఈ శ్లోకంలో గమనింపదగిన కావ్యాలంకారం ఒకటి ఉన్నది. సంధ్యారంభంలో తాండవంచేసే పరశివుని జటాజూటం విప్పుకొన్నట్లే మల్లెలూ, సాయంతసమయంలో పరిపూర్ణంగా వికసిస్తాయి. ఈశ్వరునికి శ్రుతిశిరస్థానాలు వాసమైతే, మల్లెలు నారీశిరస్థానాలను ఆక్రమించుకొంటున్నవి. భ్రమరాంబిక ఈశ్వరాన్వేషణం చేస్తే, భ్రమరములు మల్లెలను అన్వేషిస్తున్నవి. ఈశ్వరునికున్న సద్వాసన మల్లెలకున్నూ కద్దు. భోగీంద్రుడు అనగా సర్పం-శంకరునికి ఆభరణం. భోగీంద్రులకు మల్లెలు అలంకారాలు. ఈశ్వరుడు సుమనస్కులలో-దేవతలలోపూజ్యుడు. సుమనస్సులలో అనగా పుష్పములలో మల్లెలకు ఒక విశేషస్థానం. ఈశ్వరుడు గుణావిష్కృతుడు, అనగా శుద్ధసత్త్వ గుణము కలవాడు. మల్లెలూ గుణావిష్కృతములై అనగా దారములో గ్రువ్వబడి, అందాన్నీ సౌరభాన్నీ వెదజల్లుతూ ఉంటై. ఈశ్వరుడే ఒక్క పెద్ద బొండుమల్లె!

మల్లెలంటే ఈశ్వరునికి ఇష్టం. మల్లెల తెల్లదనం. సౌరభం ఈశ్వరుని సత్త్వగుణానికి చిహ్నం. శివభక్తులే కాక సాక్షాత్‌ శివావతారమేఅయిన భగవత్పాదులవారివాక్కులు- కామకోటిపీఠము శ్రీముఖంలో ''అతులిత సుధారస మాధుర్య కమలాసన కామినీ ధమిల్ల సంపుల్ల మల్లికామాలికానిష్యంద మకరందఝరీ సౌవస్తిక వాజ్నిగుంభ విజృంభణానంద తుందిలిత మనీషి మండలానాం''-అని సరస్వతీదేవికొప్పులోతురుమబడిన మల్లెల తేనియలకంటే మధురమైనవని వర్ణింపబడింది. మల్లెలు వసంతఋతువులో విశేషం. ఆచార్యులవారి జన్మదినమూ, వసంతఋతువులో మాధవీమాసం లేక వైశాఖంలో వస్తున్నది. వాసంతి, మాధవి అనే పదాలు మల్లెలకూ వర్తిస్తవి. మల్లెతీవ సైతం వైశాఖిగానే ఉన్నది. శంకరజయంతి మాధవీ పంచమీనాడు చల్లని, తెల్లని మల్లెవలె వస్తున్నది.

శం అనగా సుఖము, నిత్యానందము. బృహదారణ్యకము దానిని ప్రియమని చెప్పుతున్నది. సాధారణ జనానీకానికి ఆసుఖము, ఆప్రియము, ఆ శం స్వరూపము తెలియదు. ప్రాపంచిక భారంతో వారు శ్రమిస్తూ క్రుంగిపోయి ఉంటారు. వ్యధపడు ఈజీవులను చూచిన ఆచార్యులవారి హృదయం ద్రవించి పోయింది. వారిది విస్తారమైన భూతదయ. ఈ జీవులకు ఆత్మజ్ఞానం కల్గితేకాని ఆనందమేమిటో తెలియదని నిశ్చయించారు.

దుఃఖాన్ని దూరంచేసే ఆనందం ఏది? సుఖమే ఆనందం. సుఖంసుఖం అంటేఏమి? వారివారి ఆత్మయే వారికివారికిసుఖం; వారివారికి ఆనందం. మనంచూచే ప్రతిదీ ఆత్మయే. ఆ ఆత్మయే బ్రహ్మము. మన కంటికి కనపడేప్రతివస్తువూబ్రహ్మస్వరూపమే. ఈ ఆత్మానందం అన్ని అనుభవాల్లోనూ మనం పొందగలగాలి. ప్రపంచంలో ఉన్న వస్తువులు మన కెట్లా ప్రీతి నిస్తున్నాయి? ఆత్మకారణంచేత. ఆత్మసంబంధం వస్తువులకు వీడిపోతే, వస్తువుల పైని ప్రేమకూడా అంతరిస్తున్నది. అందుచే ప్రీతి నిజానికి ఆత్మలో పుట్టుతున్నదని మనం గ్రహించాలి. ఆత్మ బ్రహ్మనికి అభిన్నమని తెలుసుకోవడమే మోక్షం.

వేదము 'సర్వం ఖల్విదం బ్రహ్మ' అని చెప్పినది. ఆచార్యులూ 'పరమాత్మ ఒక్కడు. అంతా ఆ పరమాత్మ స్వరూపమే'అని బోధించినారు. చార్వాకులు 'దృశ్యప్రపంచమే సత్యం; ఇదికాక వేరే బ్రహ్మమనేది లేదు' అని అన్నారు. ద్వైతులూ, నైయాయికులూ 'బ్రహ్మమూ, ప్రపంచమూ రెండూ నిజమే' అని ఒప్పుకొన్నారు. బౌద్ధులు ఈ రెంటినీ కాదన్నారు. ఆచార్యులొక్కరే, బ్రహ్మమొక్కటే సత్యం. ప్రపంచమునకు ప్రత్యేక వస్తుత్వం లేదు. దాని వాస్తవం, బ్రహ్మ స్వరూపమైనందువల్లనే' అని ఉద్ఘాటించినవారు.

సూర్యుని సమక్షంలో వెలవెలబోయిన నక్షత్రాలవలె శాంకరసిద్ధాంతములముందు ఇతరసిద్ధాంతములు కాంతిహీనములైనవి. అన్నినదులూ సముద్రములో కలిసేవిధంగా, భక్తి, ఉపాసన, తంత్రము, ఆచారము, యోగము, సమాధి అనే వివిధమార్గములూ ఆచార్యుల అద్వైతములో కలిసిపోయినవి.

భగవత్పాదులేకాక ఇతరులుకూడా ఆత్మలాభార్థం, చిత్తశుద్ధికోసం వర్ణాశ్రమధర్మాలను పాటించాలన్నారు. వర్ణాశ్రమ ధర్మం ఒక్క సామాజికవ్యవస్థ కోసమేకాక, చిత్తశుద్ధికోసం కూడా ఏర్పడ్డదనీ వారువారు వారివారి ధర్మాలను పాటించి శమదమాది వైరాగ్యగుణముల మూలంగా మోక్షానందాన్ని పొందవచ్చుననీ మనం గ్రహించాలి.

దుర్లభం త్రయ మేవైతత్‌ దైవానుగ్రహ హేతుకం,

మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః||

స్వ వర్ణాశ్రమ ధర్మేణ తపసా హరితోషణాత్‌,

జ్ఞాన ముత్పాద్యతే పుంసాం వైరాగ్యాది చతుష్టయమ్‌||

ఈశ్వరార్పణభావంతో వర్ణాశ్రమధర్మాలను పాటిస్తే వైరాగ్యాదులు ఏర్పడుతవని ఆచార్యులవారు అన్నారు. గీతా శాస్త్రమూ అదే చెప్పుతున్నది.

'తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ'

ఏది చేయతగింది? ఏది చేయరానిది! అనే విచికిత్సలో నీకు శాస్త్రమే ప్రమాణం. తస్మాచ్ఛబ్దప్రయోగం ఉండటంవల్ల అర్థవివరణకు, మనం దీనికి ముందున్న శ్లోకాలను చూడాలి.

కామక్రోధాలోభాలనేవి నరకానికి మూడుద్వారాలు. ఇవి అధోగతికి కారకాలు, వీనినుండి విముక్తిని కోరేవాడు ఆత్మశ్రేయస్సుకోసం తపో యోగాది కర్మలను చేసి ముక్తికై యత్నిస్తాడు. కర్తవ్యాకర్తవ్యాలను ఉపదేశించే శాస్త్రియ విధి నిషాధాలు ఎవడైతే యథేచ్ఛాచారియై వదలిపెట్టుతున్నాడో వానికి సుఖంగానీ, పరగతిగానీ లేదు. అందుచే కార్యాకార్య నిర్ణయంలో శాస్త్రమే నీకు ప్రమాణం. అదే నీకు ఉపదేష్ట - అని గీత అంటున్నది.

ఉపనిషత్తులను వివరిస్తూ ఆసేతు హిమాచలం ఆచార్యులుపర్యటించినారు. క్షేత్రాలుదర్శించినారు. తీర్థాలుసేవించినారు. యంత్రాలు స్థాపించినారు. ఆచార్యులు వచ్చినట్టు ప్రతి క్షేత్రంలోనూ, ఐతిహ్యం ఉంటున్నది. 'ఇది ఆచార్యుల ప్రతిష్ఠ' అని అచటివారు సగర్వంగా చెప్పుకొంటూ ఉంటారు. వేదాధ్యయనం జరిగే ప్రతిచోటా. శాంకరభాష్యాలను గురుశిష్య పరంపరగా పఠిస్తూ ఉంటారు.

నాటినాటికీ భౌతిక శాస్త్రాలు వృద్ధిపొందుతున్నవి. ఈ శాస్త్రవిజ్ఞానంతో పాటు నూతన మారణాయుధాలూ ఉత్పన్నమౌతున్నవి. ఇది భయంకరమైన విషయం. మరొకదృష్టితో చూస్తే శాస్త్రవిజ్ఞానం మానవునికి శాంతికూడ ఇవ్వగలదనితోస్తుంది. యాభైఏళ్ళక్రితం శాస్త్రజ్ఞులు పదార్థంఅణుమూలమనీ, అణుసంయోగ కారణంగా ఏర్పడ్డదని అన్నారు. వస్తువులకు నానాత్వముందన్నారు. ఇప్పుడు శక్తిపరిణామమే పదార్థమనిఅంటున్నారు. పదార్థంశక్తిసంభూతమని అంగీకరిస్తున్నారు. అంటే నవీనశాస్త్రజ్ఞులు నానాత్వాన్ని వదలి ఏకత్వానికి - అనగా అభేదసిద్ధాంతానికి వచ్చినారన్నమాట. ఎయిన్‌ స్టి&, సర్‌ జేమ్స్‌ జీన్స్‌, ఎడ్డింగ్ట& లాంటి వైజ్ఞానికులు భగవత్పాదుల అద్వైతసిద్ధాంతపు ఒడ్డులకే వచ్చారన్నమాట ఈ భౌతిక ప్రపంచం తీరాచూస్తే నిజంకాదనీ, దీనికి సాంబంధిక సత్యం మాత్రం కద్దనీ, తీర్మానించి కడపటికి భేదాన్ని నిరాకరించేస్థితికి వచ్చారు.

అందుచేత నేటి వైజ్ఞానికులు తీర్మానాలు భేదప్రపంచ నిరాకరణలో శంకరులసిద్ధాంతాన్నే స్థిరీకరిస్తున్నవి. ఈధోరణి కాంతిప్రతిపాదకం కావచ్చు. అభేదతను గుర్తించే అంతర్దృష్టియే ఏర్పడితే దేశ విదేశ భేదాలూ, పాలిత పాలకుల వైమనస్యమూ సమసిపోయి మానవులలో, ఇతరులు మనకంటేవేరుకాదన్న జ్ఞానంకల్గి ఐక్యం ఏర్పడవచ్చు. అపుడు వైరమున్న దేశాలపట్లకూడా సహనం ఏర్పడగలదు. అట్టి భావౌదార్యం శాంతికారకం కావచ్చు. ఇట్టి అమూల్యసందేశాన్నీ, అద్వైతజ్ఞానాన్నీ మనకు ప్రసాదించిన భగవత్పాదుల పుణ్యదినంజరుపుకోవడమయినా కనీసానికి కనీసమైన ధర్మం.


Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page